వర్షాకాలంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో నగరంలో పలుచోట్ల వాహనాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో వనస్థలిపురంలో ఓ కారు నాలాలోకి దూసుకెళ్లింది.
హయత్ నగర్‌కు చెందిన జిల్లా వినోద్ తన భార్యాపిల్లలతో కలిసి ఎల్‌బీనగర్ వైపు భారీ వర్షంలో వెళ్తున్నాడు. వనస్థలిపురం పనామా చౌరస్తా వద్దకు రాగానే కారు అదుపు తప్పి వర్షపు కాలువలోకి దూసుకెళ్లింది. వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు ఘటనాస్థలిని గమనించి వెంటనే స్పందించి కారులో ఉన్న ముగ్గురు పిల్లలతో సహా కుటుంబాన్ని కాపాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు సమయపాలన పాటించి సిబ్బందికి తగు సూచనలు చేయడం అభినందనీయమన్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ట్రాఫిక్ సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డిలు భారీ క్రేన్ సహాయంతో నాలాలో ఇరుక్కుపోయిన కారును బయటకు తీశారు.