వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాలతో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు ఫుల్ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలు పడుతున్న అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలర్ట్ లు పంపించాలని చంద్రబాబు ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.