వీధి కుక్కలకు భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లేటప్పుడు వీధిలో కుక్కలు ఉంటే చాలు అటువైపు వెళ్లడం మానేసే పరిస్థితి వచ్చింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిపైనా వీధికుక్కలు దాడి చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో కుక్కల దాడిలో పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో భాగ్యనగర్ వాసులు వీధికుక్కల సమస్యలతో ఆందోళన చెందుతున్నారు.
బాలానగర్‌లో గంటల్లోనే 28 మందిపై వీధికుక్కలు దాడి చేసాయి. అందులో ఐదుగురికి సీరియస్‌గా ఉంది. అలాగే పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాలానగర్‌లోని రాజు కాలనీ, వినాయకనగర్, సాయినగర్‌లో వీధికుక్కలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మాంసం దుకాణాల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల కూడా కుక్కలు క్రూరంగా మారుతున్నాయి. ఈ సమస్యపై ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది జీహెచ్‌ఎంసీ.