వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు, మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఆయన ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంవీవీతో పాటుగా ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం పరిధిలో నమోదు చేసిన కేసులు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే, ఎంవీవీ ప్రస్తుతం ఇంట్లో లేరని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఎంవీవీ తెలుగులో పలు చిత్రాలను కూడా నిర్మించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.