తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు బ్రాంచ్ మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాలేజీల్లో చేరి, కన్వీనర్ కోటాలో ఈఏపీ సెట్ 2024 ద్వారా బీటెక్ సీట్లను ఎంపిక చేసుకున్న విద్యార్థులు బుధవారం నుంచి అదే కాలేజీలోని మరో బ్రాంచ్‌కి మారేందుకు ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సీట్ల తుది జాబితా బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 22 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, కోర్సులు మార్చుకోవాలనుకుంటే ఈ నెల 24న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ఇంజినీరింగ్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ దేవసేన ప్రకటించారు. స్లైడింగ్ పద్ధతిలో కొత్త బ్రాంచీల్లో సీట్లు పొందిన వారు 25వ తేదీలోగా చేరాలి.