తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు ఈ రోజు (సోమవారం) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత ఇవే మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షలలో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. అలాగే, మంగళవారం గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
ఎట్టకేలకు నెల క్రితం దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. అనంతరం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.