హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరు, హైటెక్ సిటీ, పంజాగుట్ట, చేవెళ్ల, లక్డీకపూల్, టోలీచౌకి, బంజారాహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేట, సెరిలింగంపల్లి, ఎర్రగడ్డ, ఫిలింనగర్, మాసబ్ ట్యాంక్, మొయినాబాద్, ఎస్సార్ నగర్, చందానగర్, నాంపల్లి, కొండాపూర్, శంకర్ పల్లి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షాలకు పలు రహదారులు జలమయమై వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించి ఉంది. ఈ అభివృద్ధి కొమొరిన్ ప్రాంతాన్ని తమిళనాడు నుండి రాయలసీమ వరకు ప్రభావితం చేస్తుంది. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.