హైదరాబాద్-విజయవాడ మధ్య రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో ముంపునకు గురైన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తికావడంతో అధికారులు రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. హైదరాబాద్ నుండి వరంగల్ మీదుగా విజయవాడకు రైళ్లు ఉన్నాయి. తొలుత విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు ట్రయల్ రన్‌కు పంపారు. ఈ రైలు గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది.
కాగా, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో తెలంగాణ, ఏపీ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. మూడు రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి ట్రాక్‌ను పునరుద్ధరించారు. మరమ్మతు పనులు పూర్తికావడంతో అధికారులు కొబ్బరికాయ కొట్టి ఈరోజు (సెప్టెంబర్ 4) ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈరోజు (బుధవారం) సాయంత్రం నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా ప్రారంభమవుతాయి. కాకపోతే ప్రమాద స్థలంలో రైళ్ల వేగం తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ రైళ్లు ప్రారంభం కానున్నాయి.