ఇప్పటికే చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ హైటెక్‌సిటీలోని నాలాలపై సారిస్తోంది. బడాబాబులు చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగులు పడగొట్టిన ఆ సంస్థ ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సర్వే ద్వారా ఈ నాలాలపై ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు. ఈ సర్వేకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుండగా, ఇప్పటికే హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం సమావేశమైనట్లు తెలిసింది.
ఇటీవల హైటెక్ సిటీలో కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు నీట మునిగాయి. మరికొద్ది రోజుల్లో మరో రెండు తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. దీంతో వానలు పడుతున్నప్పుడు హైటెక్‌సిటీ పరిధిలో ఉన్న ఆ రెండు నాలాల సమీపంలో ఉన్న ఏయే కాలనీలు మునుగుతున్నాయి? కారణాలేమిటి అనేది హైడ్రా తెలుసుకోనుంది. నీళ్లు నిండిన ప్రాంతాల్లో డ్రోన్లతో సర్వే చేసి ఆక్రమణలను గుర్తిస్తారు. తర్వాత కూల్చివేతలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.