ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11 నుంచి అక్కడే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది రాగా, వారిలో 14 మంది కేదార్‌నాథ్‌ను సందర్శించి బద్రీనాథ్‌కు బయలుదేరారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్-బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్, విజయనగరం నుంచి వచ్చిన యాత్రికులు రెండు రోజులుగా కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, చలితో అల్లాడిపోతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడి అధికారులు హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు.
మరోవైపు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడి ప్రోత్సహించారు. అక్కడి నుంచి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని ఎంపీ తెలిపారు. యాత్రికుల సమస్యలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో కలిశెట్టి చర్చించారు. తక్షణమే యాత్రికులను రక్షించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. పలువురు యాత్రికుల పరిస్థితి విషమంగా ఉందని, వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని ఎంపీపీ కలిశెట్టి అప్పల నాయుడు తెలిపారు.