News5am, Latest News Today ( 02/05/2025) : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున సృష్టించిన దుమ్ము తుఫాన్, భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకొరిగాయి. నజాఫ్‌గఢ్‌లో భారీ చెట్టు కూలడంతో నలుగురు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 26 ఏళ్ల జ్యోతి అనే వివాహితతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. భర్త అజయ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. దాదాపు 100కి పైగా విమానాలు ఆలస్యం కానున్నట్లు విమాన సంస్థలు హెచ్చరించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనెక్టివిటీ విమాన ప్రయాణికులు మాత్రం మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన రెండు విమానాలను జైపూర్‌కు, ఒక విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు అధికారి తెలిపారు.