News5am Latest Telugu News (08/05/2025) : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం లో విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న సమయంలోనే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ ఓ భారీ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకవైపు ఉష్ణత తీవ్రత, మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C నుంచి 42°C మధ్య నమోదు అయ్యే అవకాశముందని, శుక్రవారం నుంచి వేడిని తీవ్రతగా అనుభవించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం రోజున 15 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 28 మండలాల్లో సాధారణ వడగాలులు ఉంటాయని వెల్లడించారు. మే నెలలో ఇప్పటివరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86 మిమీ, రామచంద్రపురంలో 73.5 మిమీ, కొత్తపేటలో 64.5 మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7 మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ వర్షపాతం నమోదైంది.