మృతువు ఎప్పుడు ఎక్కడనుంచి దూసుకొస్తుందో పసిగట్టలేం.ఈ విషాద ఘటన న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇంటి బయట మాట్లాడుతున్న 18 ఏళ్ల యువకుడిపై రెండో అంతస్తు నుంచి ఏసీ యూనిట్ పడడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎక్కడికో పని మీద బయటకు వెళ్లేందుకు వచ్చిన యువకుడు స్కూటర్ తీసితన తోటి స్నేహితుడితో మాట్లాడుతుండగా గోడకు బిగించిన ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఒక్కసారిగా వారిపై పడింది. మృతుడిని జితేశ్‌గా గుర్తించగా, ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని ప్రన్షు(17)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించినందుకు 125(ఏ), నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మృతికి కారణమైనందుకు 106 సెక్షన్ల కింద ఏసీ యూనిట్ యజమానులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.