జీవితంలో ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం, కృషి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య మరొక ఉదాహరణ. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న చాలా మంది నిరుత్సాహం కారణంగా తమ ప్రయాణాన్ని వదులుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే నిరుత్సాహపడకుండా తమ లక్ష్యం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. సాయి చైతన్య అలాంటి విజేతలలో ఒకరు. చైతన్య చివరకు సివిల్ సర్వీసెస్‌లో అద్భుతంగా స్కోర్ చేయడం ద్వారా తన కలను సాధించాడు. అతను సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించాడు.
దేశంలోనే అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న చైతన్య కృషికి ఆషామాషీ కాదు. అతను ఐదుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలలో నిరాశను ఎదుర్కొన్నాడు. అయినా, పట్టుదల వదలని విక్రమార్కుడిలా, డీలా పడకుండా, తన ప్రయత్నాన్ని కొనసాగించారు. చివరకు ఆరో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 68వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.