బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి సంచలనాత్మక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులు సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉన్న ఉన్నతాధికారులకు సుమారు రూ. 2,200 కోట్ల లంచం చెల్లించినట్లు అమెరికాలో అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ముందడుగు వేసి ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. అదానీ గ్రూప్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ ఆదేశాలను ఉల్లంఘించిందా లేదా అన్న అంశాన్ని సెబీ పరిశీలిస్తోంది. అంతేకాక, షేర్ల ధరలను ప్రభావితం చేసే సమాచారం వెల్లడించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. లంచం ఆరోపణలపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన దర్యాప్తు వివరాలను సమగ్రంగా వెల్లడించడంలో అదానీ గ్రీన్ ఎనర్జీ విఫలమైందా? అనే అంశంపై స్పష్టతకు స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులను సెబీ ఆదేశించినట్టు తెలుస్తుంది.