హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 20 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 20) వరకు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. దీని ప్రభావంతో ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో సగటున 898.1 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 668.6 మిల్లీమీటర్లతో పోలిస్తే 34 శాతం పెరిగింది.