ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్న, చూసిన, హైడ్రా అని పేరు మారుమోగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతే ధ్యేయంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుసగా కూల్చివేతలు చేపడుతూ, అక్రమకారులను వణికిస్తుంది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మీషన్ల ప్రక్రియనులోనూ ‘హైడ్రా’ చేర్చేందుకు నిర్ణయించారని సమాచారం. ఇక నుంచి నగరంలో ఎక్కడైనా ఇళ్లు నిర్మించాలన్న ‘హైడ్రా’ నుంచి ఎన్‌వోసీ (NOC) ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ‘హైడ్రా’ కళ్లుగప్పి ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపడితే ఆ ఇంటి నంబర్, నల్లా, కరెంట్ కనెక్షన్లను తొలగించనున్నట్లుగా తెలుస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు నష్ట పోకుండా ఉండేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.