రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రాజధాని హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. హయత్ నగర్, ఆసిఫ్ నగర్, బాలానగర్, పటాన్ చెరు, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, గోల్కొండ, కూకట్ పల్లి, సెరిలింగంపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నీటి కాలువలుగా మారాయి.
7 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా. జోగులాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.