తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు ఈరోజు తెల్లవారుజాము నుంచి పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా కోఠి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్, తార్నాక, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.దీంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై నీరు నిలవడంతో చాదర్‌ఘాట్ నుంచి ఎల్‌బీనగర్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.