కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 123కి చేరింది. మరో 128 మంది గాయపడ్డారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సెర్చ్ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగిందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది వేగంగా పని చేస్తున్నారని చెప్పారు.
కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. హృదయ విదారక దృశ్యాలు ప్రతిచోటా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసినవారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇళ్లలో చిక్కుకుపోయిన కొందరు తమను కాపాడాలంటూ ఇళ్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. ముండక్కై, చూరల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిసారిగా కొండచరియలు విరిగిపడగా, తెల్లవారుజామున 4.10 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామాలకు గ్రామాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి.