మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజగా మరో ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి సముద్రంలో దూకేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. బ్రిడ్జి రెయిలింగ్ దాటుకుని కిందకు దూకుతుండగా చివరిక్షణంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను పట్టుకున్నాడు. అప్పటికే అక్కడున్న పోలీసులు కూడా వెంటనే స్పందించి మహిళను కాపాడారు. శుక్రవారం సాయంత్రం అటల్ సేతు బ్రిడ్జిపై చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
సూసైడ్ అటెంప్ట్ చేసిన మహిళ పేరు రీమా ముఖేశ్ పటేల్ అని, నార్త్ ఈస్ట్ ముంబైలోని ములంద్ కు చెందిన వారని పోలీసులు పరిణగించారు. దూకడానికి ముందుగా రీమా తన చేతిలో ఉన్నదానిని సముద్రంలో పడేయడం వీడియోలో కనిపించింది. క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి, బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే స్పందించడంతో రీమా ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.