హైదరాబాద్: యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమించడం సరికాదని, వెంటనే రెగ్యులర్ వీసీలను నియమించాలని తెలంగాణ విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారంతో రెగ్యులర్ వీసీల పదవీకాలం ముగుస్తుందని తెలిసినా ఐఏఎస్ అధికారులను ఇన్చార్జి వీసీలుగా ఎందుకు నియమించారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్మూర్తి, కార్యదర్శి టి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్చార్జి వీసీల నియామకం యూనివర్సిటీల్లో పరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, ఐఏఎస్ అధికారులు ఇప్పటికే పలు శాఖల్లో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారని అభిప్రాయపడ్డారు.‘‘పాలనలో అనుభవం ఉన్న వారిని ప్రభుత్వం వెంటనే వీసీలుగా నియమించాలని కోరుతున్నాం. రాజకీయ ప్రమేయం లేకుండా ప్రభుత్వం సామాజిక సమతుల్యతను కాపాడుతూ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఐఐఐటీ-బాసర్ చట్టాన్ని సవరించి, సంస్థలో జరుగుతున్న అవినీతిపై విచారణతో పాటు పూర్తిస్థాయి వీసీని నియమించాలని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.