హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “మిస్టర్ బచ్చన్” సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మిస్టర్ బచ్చన్ టీం అందరికంటే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ, ఏం తమ్ముళ్లు.. మెట్రోలో ప్లేస్ దొరకలేదా.? లేకుంటే కూర్చోగానే లేపేస్తున్నారా.? అయినా పర్లేదు.. మిస్టర్ బచ్చన్ నుండి లేటెస్ట్ గా పాట రిలీజ్ అయింది.. హ్యాపీగా వినుకుంటూ నిల్చొని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్లండి అంటూనే.. ఇక్కడ సీటు దొరకపోయినా పర్లేదు.. ఆగస్టు 15న సినిమా థియేటర్ కు వచ్చేయండి అక్కడ సీటు గ్యారెంటీ అంటూ హీరో రవితేజ వాయిస్ మెసేజ్ తో ప్రయాణికులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వాయిస్ మెసేజ్ వింటున్న మెట్రో ప్రయాణికుల హావభావాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని జంటగా నటించిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది