సుదీర్ఘ రావణ కాష్ట తర్వాత కాస్త చల్లారినట్లు కనిపిస్తున్న తరుణంలో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మెయితీ, కుకీలు మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే హింసాత్మక ఘటనలు పుంజుకోవడం ఆందోళన కలిగించే అంశం. శుక్రవారం రాత్రి లాల్పాని గ్రామంలో అల్లరిమూకలు ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో అల్లరిమూకలు కూడా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. గురువారం, అస్సాంలోని కాచర్‌లో CRPF దళాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మైతీ మరియు కుకీ సంఘాల ప్రతినిధులు శాంతి ఒప్పందానికి వచ్చారు.
ఈ ఒప్పంద సమావేశానికి జిరిబామ్ జిల్లా యంత్రాంగం, అస్సాం రైఫిల్స్, CRPF సిబ్బంది మధ్యవర్తిత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాడు, పైట్, మిజో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఇరు వర్గాల ప్రతినిధులు కొన్ని తీర్మానాలు చేశారు. అందులో భాగంగానే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని, ఆయుధాలు పట్టకూడదని, హింసను ప్రేరేపించకూడదని ఇరువర్గాలు నిర్ణయానికి వచ్చాయి. హింసాత్మక ఘటనల కారణంగా ఆగస్టు 15న ఇరువర్గాలు మరోసారి సమావేశం కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, హింస చెలరేగిన జిరిబామ్ జిల్లాలో సాయుధ బలగాలను భారీగా మోహరించారు మరియు పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు.