హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారు. రెండు రోజులుగా ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ అనుచరులు కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఆ తర్వాత తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. అరికెపూడి గాంధీకి పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకురావాలని, లేకపోతే లోపలికి పంపించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులకు, గాంధీ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అరికెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.