తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ ముందు నిరసన తెలిపిన వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. అనంతరం అక్కడి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బుధవారం (జూలై 31) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్‌కు వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ఉదయం నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దీనిపై ప్రభుత్వం చర్చను ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. నిండు సభలో మహిళా సభ్యులను అవమానించినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితేనే మైక్ ఇస్తానని స్పీకర్ పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. వెల్‌లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. స్పీకర్ మందలించడంతో వారు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్ ఎదుట గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అసెంబ్లీ మార్షల్స్ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించారు.