బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ ఈరోజు కలవనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కవిత ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీయనున్నారు. మరోవైపు కవితకు కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. పరీక్షల అనంతరం నివేదిక సమర్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతకుముందు జైలు అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లోని వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కవిత తరఫు లాయర్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కవిత తన విజ్ఞప్తిని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల కవిత అనారోగ్యం కారణంగా దీన్ దయాళ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. కవిత పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.