ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరగనుంది. 10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థపై చర్చిస్తామన్నారు. విద్యావ్యవస్థలో ప్రభుత్వ విధానాలపై బీఆర్‌ఎస్‌వీలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రతినిధి బృందానికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సమన్వయకర్తలు, ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరుకానున్నారు.
మాకు మీ మద్దతు కావాలని కేటీఆర్ ని కోరిన గ్రూప్స్ 1 అభ్యర్థుల, అభ్యర్థన మేరకు వారిని కలుస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా గ్రూప్స్ అభ్యర్థులు కేటీఆర్ కి మెసేజ్ చేశారు. మమ్మల్ని మన్నించాలి, మీరు అశోక్ నగర్ రావాలి, మాకు మీ మద్దతు అవసరం ఉంది, అన్ని వ్యవస్థలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మీ మద్దతు ఉంటే మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది, గ్రూప్ వన్ అభ్యర్థులంతా ఏకతాటిపైకి వచ్చి మీకు సర్వదా రుణపడి ఉంటాము అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ప్రతిగా ఇవాళ మిమ్మల్ని కలుస్తాను. అశోక్ నగర్ వేదికగా అయినా కావచ్చు లేదా తెలంగాణ భవన్ వేదికగా అయినా సరే మిమ్మల్ని కలుస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తుంది అని భరోసా ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ యువతకు తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటామని కేటీఆర్ అన్నారు.