ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు .జైలు డాక్టర్ల సూచనల మేరకు వైద్య పరీక్షల కొరకు అధికారులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు.
ఇంతకముందు కూడా ఓసారి ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురియైన విషయం తెలిసిందే. జులై 16న ఆమెను దీన్‌దయాళ్ అసుపత్రికి తరలించారు. అప్పుడు ఆమెకు జ్వరం రావడంతో పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్‌లో గల దీనదయాళ్ ఆసుపత్రికి తరలించారు. జ్వరం నుంచి కోలుకున్నాక, తిరిగి జైలుకు తరలించారు. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు. కవితపై సీబీఐ,ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈసారైనా ఆమెకు బెయిల్ వస్తుందని కవిత, పార్టీ కార్యకర్తలు , ఆమె కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.