ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్‌కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ సబ్‌కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ప్రభుత్వం కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఆరోగ్య కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు, పద్ధతులను సబ్-కమిటీ పరిశీలిస్తుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డుల కోసం వార్షికాదాయం, భూ పరిమితి తదితర అంశాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది.