వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. వేలాది బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది. తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. కుంభవృష్టితో పంటలు నీట మునగడంతో వాటిపై ఫోకస్ పెట్టాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆయా జిల్లాల నుంచి సమాచారం కోసం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి టోల్ ఫ్రీ నంబర్ 040 – 23454088 ఏర్పాటు చేయించారు. ఎవరికైనా అత్యవసర సాయం కావాలంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు, రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లకు సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యతా క్రమంలో త్వరతగతిన మరమ్మతులు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం బయలుదేరారు.