సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ కాలేదని, అలాంటి వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు తాము సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. 2014 తర్వాత బీజేపీ ఏనాడూ రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీపై రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు.
కొంతమంది రైతులకు రుణమాఫీ కాని విషయం గురించి మంత్రి వివరించారు. 1.20 లక్షల రైతు ఖాతాలకు ఆధార్ నెంబర్లు సరిగ్గా లేవన్నారు. అలాంటి వారికి రుణమాఫీ జరగలేదన్నారు. కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగ్గా లేకపోవడం, రేషన్ కార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. వాటిని సవరించడానికి ప్రక్రియను ప్రారంభించామన్నారు. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు.రుణమాఫీ కాని రైతుల వివరాలను తీసుకుని పోర్టల్ లో అప్ లోడ్ చేస్తే రుణమాఫీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు.