తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్‌ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని ఆరోపించారు. వారు బతికున్నారో లేదో అనే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొందన్నారు.
అరచేతిలో స్వర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ప్రజల టెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. 15 నెలల నుంచి కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ పేరుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. 6500 కోట్లు కేవలం వడ్డీ లెక్క అయిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదు.” అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు.