పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా) : జిల్లావ్యాప్తంగా తమకు అనుకూలంగా ఓటు వేసిన ఓటర్లకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ కృతజ్ఞతలు తెలుపుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన వీరిద్దరూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలను సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, మీడియా మిత్రులు, ఓటర్లకు కృతజ్ఞతలు’ అని వారు తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వంపై విసిగి వేసారిపోయి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించాలని కోరుతూ యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి దాదాపు 130 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనతో అధికార పార్టీ నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.