హైదరాబాద్: నగరంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీవీ చిత్రపటం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఘనంగా నివాళులర్పించారు. పీవీ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పార్టీ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణ భారత నేత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని అన్నారు. ‘‘దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివి. ప్రస్తుతం విపత్తు అంచున ఉన్న దేశానికి ప్రధానిగా ఆర్థిక దిశానిర్దేశం చేశారు పీవీ. ‘‘ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని నడిపించిన వ్యక్తి మా పీవీ. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావును దేశం ఎప్పటికీ మరిచిపోదు’’ అని అన్నారు.