హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు, ‘యు-టాక్స్’ వసూళ్లలో రూ.1600 కోట్ల కుంభకోణం జరిగిందని తెలంగాణ బీజేఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.తేమ శాతం, చుక్క ఎక్కువగా ఉందన్న కారణంతో మిల్లర్లు రైతుల నుంచి అదనపు వరి ధాన్యాన్ని సేకరిస్తూ రైతుల శ్రమను లూటీ చేస్తున్నారని అన్నారు. ‘‘క్వింటాల్‌కు 10 నుంచి 15 శాతం ఈ విధంగా కొల్లగొడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం వరి సేకరణ పరిమాణాన్ని పరిశీలిస్తే అది దాదాపు రూ.1,600 కోట్లు దోచుకున్న డబ్బు అంతా ఎవరి ఖాతాల్లోకి వెళుతోంది’’ అని ప్రశ్నించారు. దుక్కులు దున్నడం నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులు కష్టపడి వడ్లను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.‘యు-టాక్స్’ పేరుతో రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. అందులో 100 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిధుల కోసం ఢిల్లీకి పంపారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.