ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు 2024 సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లను పూర్తి చేసుకున్న ముంబై కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. తాజాగా శుక్రవారం (మే 17) లక్నోతో జరిగిన ఆఖరి మ్యాచ్ లోనూ ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75), కేఎల్ రాహుల్ (55) అర్ధశతకాలతో రాణించారు. ముంబయి బౌలర్లలో తుషారా, చావ్లా తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (68), నమన్ ధీర్ (62*) చెలరేగి ఆడినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో రవిబిష్ణోయ్ 2, నవీనుల్ హక్ 2, కృనాల్ పాండ్య, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో ఇరుజట్లు తమ లీగ్ దశను ముగించాయి. ప్లే ఆఫ్ కుఅవకాశం లేకపోవడంతో ఇరు జట్లూ ఇంటి బాట పట్టాయి.