News5am Latest Telugu News (10/05/2025) : భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, కోహ్లీ కూడా అదే దారిలో నడవనున్నారని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, తన టెస్ట్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతుండగా, ఆ పర్యటన ప్రారంభానికి ముందు కోహ్లీ తన టెస్ట్ భవితవ్యంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. గతంలో కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు టెస్టుల నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటే, భారత క్రికెట్లో ఓ శకం ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.