రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్ శివార్లలోని బేగరికంచలో స్టేడియం నిర్మించున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రత్యేకంగా క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామని, హర్యానా తరహాలో క్రీడాకారులను పోత్సహిస్తామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని, స్పోర్ట్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
క్రీడా కారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ జరీన్‌కు, సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేవలం ఉద్యోగాలే కాదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 600 గజాల చొప్పున ఇంటి స్థలం కూడా కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకోసం పిల్లలను క్రీడలకు దూరం చేస్తున్నారని, క్రీడల ద్వారా ఉపాధి మరియు వారి కుటుంబానికి గౌరవం కూడా లభిస్తుందంటూ పేర్కొన్నారు.