సైన్స్‌ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ, నడిపించే శక్తిగా సైన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. సైన్స్ అద్భుతతను, దాని ప్రభావాన్ని మనందరికీ తెలియజేయడంలో ‘నేషనల్ సైన్స్ డే’ (National Science Day) ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇక ఈ ‘నేషనల్ సైన్స్ డే’ పుట్టుక విషయానికి వస్తే, భారతదేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న తన ప్రఖ్యాత “రామన్ ఎఫెక్ట్” (Raman Effect)‌ను కనుగొన్నారు. ఈ ప్రాచుర్యం చెందిన శాస్త్రీయ పరిశోధనకు గౌరవసూచకంగా భారత ప్రభుత్వం 1987 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటోంది.

రామన్ చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్‌హుడ్ బిరుదును ప్రదానం చేసింది. 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం “భారతరత్న” ప్రకటించింది. చివరకు 1970 నవంబర్ 21న సీవీ రామన్ తన చివరి శ్వాస విడిచినా, ఆయన సేవలు భారత శాస్త్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత విజ్ఞాన పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో పెంచే దిశగా మన దేశ యువతకు సాధికారిత కల్పించడమీ దీని లక్ష్యం. ఇది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రాధాన్యతను హైలైట్ గా చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *