సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ నెల్లూరు బారా షహీద్ దర్గాలో ప్రారంభమైంది. ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కుల, మతాలకు అతీతంగా ప్రపంచం నలుమూలల నుంచి ఈ పండుగకు వస్తుంటారు.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెలు వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు.
ప్రధానంగా ఈ పండుగ రోజు రొట్టెలను తమ కోరికలను నెరవేర్చుకోడానికి ఉపయోగిస్తారు. సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె, మొదలైన 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు.
దర్గా ప్రాంగణంలోని బారా షాహిద్ లను దర్శనం చేసుకొని తరువాత స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను వేయడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి రొట్టెను తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకుని, అది నెరవేరితే తర్వాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను వదలడం ఎనో సంవత్సరాలుగా జరుగుతున్న సంప్రదాయం. ఈ విధంగా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.