ఇటీవలే హత్యాయత్నం నుంచి బయటపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని భావిస్తున్న అమెరికా ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. ఇటీవలే హత్యాయత్నానికి ముందే ట్రంప్‌ను అంతమొందించేందుకు ఇరాన్ ప్లాన్ సిద్ధం చేసిందని అమెరికా చెబుతోంది. 2020లో ఇరాన్ టాప్ జనరల్ కాసీమ్ సులేమానీ హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ట్రంప్ ను టార్గెట్ చేసిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. రాబోయే వారాల్లో ట్రంప్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అమెరికా పత్రికల్లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి.
మరోవైపు ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, వివక్షతో కూడుకున్నవని పేర్కొంది. సులేమానీ హత్యకు కారణమైన ట్రంప్ తమ దృష్టిలో నేరస్థుడే అయినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ లకు అదనపు భద్రత కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. మున్ముందు జరిగే ప్రమాదాల గురించి తాము ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను నిరంతరం హెచ్చరిస్తున్నామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు.