బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్లు మొదలయ్యాయి. షేక్ హసీనాను అరెస్ట్ చేసి తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారతదేశాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాను అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో మరణాలకు షేక్ హసీనా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. భారత్‌తో సానుకూల సంబంధాలను కొనసాగించడం తనకు ముఖ్యమని అన్నారు.
దేశంలో ఎన్నో మరణాలకు షేక్ హసీనా కారణమని, ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారని అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించవద్దని అన్నారు. బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ఎపీ) న్యాయవాదులు పాల్గొన్నారు. షేక్ హసీనాను అప్పగించాలన్న ఖోకాన్ బీఎన్‌పీ పార్టీ జాయింట్ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేస్తున్నారు.