బంగ్లాదేశ్ రాజధానిలో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ తరలి వచ్చి ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయంపై అనుమతి వచ్చాక ఆమె లండన్ వెళ్లాలని భావిస్తున్నారు. అప్పటి వరకు భారత్‌లో ఆశ్రయం పొందనున్నారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఉంటున్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద భద్రతను మరింత పెంచారు. ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రధాన గేటు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడ ఎవరూ గుమిగూడకుండా, వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైమానిక దళ స్థావరం పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.
షేక్ హసీనా నిన్న సాయంత్రం ఢాకా నుంచి ప్రత్యేక సైనిక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్ సైనిక విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే, భారత వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ జెట్ ఫైటర్లు విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్ బేస్‌లో షేక్ హసీనాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.