హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కమ్‌లు సరికొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు మార్చి 6న (బుధవారం) ఒకే రోజు అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశాయి. ఇప్పటి వరకు గత ఏడాది మార్చి 14న 297.98 మిలియన్ యూనిట్లు సరఫరా కావడం రాష్ట్రంలోనే అత్యధిక రికార్డు. నిన్న ఈ రికార్డును డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అధిగమించాయి. రికార్డు సాధించిన విద్యుత్ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందించారు. రానున్న వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా సంస్థలు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశాయి.