హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) బస్సు కింద పడి ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని శుక్రవారం ఇక్కడి యూసుఫ్‌గూడ వద్ద దుర్మరణం పాలైంది.
యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాధితురాలు మెహ్రీన్ (16) బస్సులో కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహ్రీన్ ప్రమాదవశాత్తు జారిపడి బస్సు ముందు చక్రం కిందకు వచ్చింది. “ఆమె పడిపోయిందని గమనించని బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు. ఫలితంగా, బస్సు ఆమె పై నుంచి వెళ్ళింది. తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది” అని పోలీసు అధికారి తెలిపారు.
ఆ మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు, పాదచారులు గమనించి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.