ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం సంభవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏపీలో తొలి మరణంపై కేంద్రం పూర్తిగా దృష్టి సారించింది. నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఢిల్లీ NCBకి చెందిన ముగ్గురు సభ్యులు, ముంబైకి చెందిన మరొక వైద్యుడు మరియు మంగళగిరిలోని AIIMSకి చెందిన ఒక వైద్యుడుతో కూడిన బృందం అధ్యయనాన్ని ప్రారంభించింది. ఎయిమ్స్‌లో తొలిసారి సమావేశమైన కేంద్ర వైద్య బృందం, ఆ చిన్నారి పరిస్థితి, ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు, ఆమెను ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చారు, ఆమెకు ఎలాంటి చికిత్స అందించారు అనే విషయాలను చర్చించింది.
మరోవైపు, నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి, ఆ తర్వాత పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం విదితమే, బాలిక కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఇక, ఆ ప్రాంతంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదనే వివరాలను వెల్లడించారు. విశాఖ, విజయవాడ, కర్నూలులో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు.