News5am, Latest Telugu News ( 03/05/2025) : ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మొత్తం 89 ఖాళీల కోసం జరుగుతుండగా, ఉదయం 8:30 నుంచి 9:30 మధ్యలో పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. అదనంగా 15 నిమిషాల అదనపు అవకాశంతో 9:45 వరకు అభ్యర్థులను లోపలికి అనుమతించనున్నారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలేవీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజున తెలుగు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 4,496 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, విశాఖపట్నంలో 1190 మంది, విజయవాడలో 1801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది హాజరవుతారు. విశాఖలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.