ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణలో మార్పుకు సిద్ధమైంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు అందిస్తున్న సేవలను భీమా వ్యవస్థగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు, భీమా కంపెనీలతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కీలక సమావేశం నిర్వహించారు. భీమా పాలసీలో ఆరోగ్యశ్రీ సేవలపై సీఎం చంద్రబాబుకు సూచన ఇవ్వనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య శ్రీకార్డు ద్వారా రూ. 25 లక్షల వరకు వైద్య సహాయం అందజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ సేవలను కొనసాగిస్తోంది. ఏపీలో ట్రస్టు ద్వారా కాకుండా భీమా వ్యవస్థ ద్వారా ఈ సేవలను అమలు చేయాలని సంకీర్ణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు భీమా కంపెనీలతో ఏపీ ఆరోగ్యశాఖ తాజాగా చర్చలు జరిపింది. ఎన్డీయే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత భీమా పాలసీ ముసాయిదా రూపకల్పనకు కసరత్తు కొనసాగుతుంది.