డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. దోస్త్ స్పెషల్ ఫేజ్‌లో 44,683 మందికి సీట్లు అలాట్ చేసినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ లో మొత్తం 46,538 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. దీంట్లో మొదటి ప్రయార్టీ ఆప్షన్ లోనే 38,760 మందికి సీట్లు అలాటైనట్టు పేర్కొన్నారు.అయితే తక్కువ ఆప్షన్లు పెట్టుకున్న 1855 మంది విద్యార్థులకు సీట్ అలాట్ కాలేదని తెలిపారు. కామర్స్ కోర్సులో 16,200 మంది ఆర్ట్స్ కోర్సుల్లో 7,490 మంది, లైఫ్ సైన్సెస్ లో 9,151, ఫిజికల్ సైన్స్ లో 7,624, డీఫార్మసీలో 57 మంది, ఇతర గ్రూపుల్లో మరో 4,161 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 9లోగా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటును రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.